హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడిన మహా నేత కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని చెప్పారు. తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నివర్గాలు కదం తొక్కినట్టే ఈ కార్యక్రమంలో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ బైక్ర్యాలీలుగా బసవతారకం హాస్పిటల్ సరిల్ వరకు చేరుకుంటారని, అకడి నుంచి పాదయాత్రగా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్టు తెలిపారు. తెలంగాణ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కేసీఆర్ ఉద్యమ డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం నిర్వహించే సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతారని చెప్పారు. నిమ్స్ దవాఖానలో శుక్రవారం ఉదయం 10 గంటలకు రోగులకు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేస్తామని తలసాని తెలిపారు.
ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే తమపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను తలసాని తీవ్రంగా ఖండించారు. ఇథనాల్ కంపెనీతో తన కుటుంబసభ్యులకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే ఆ కంపెనీని వాళ్లకే రాసిస్తామని సవాల్ విసిరారు. ఇథనాల్ కంపెనీపై ఎకడంటే అకడ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందనడం విడ్డూరమని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం కూడా తెలుసుకోరా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని, బట్టకాల్చి మీదేస్తూ.. తనను, బీఆర్ఎస్ను బద్నాం చేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్తానని హెచ్చరించారు.