రంగారెడ్డి జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఓ రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన రైతు మల్లయ్య తన తల్లి పేరు మీద ఉన్న భూమిని తనతోపాటు తమ్ముడి పేరు మీదకు మార్చాలని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జునను ఆశ్రయించారు. దీనికి తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేయడంతోమంగళవారం రూ.10 వేలు తీసుకొని తహసీల్దార్ వద్దకు వెళ్లగా, అటెండర్‌కు ఇవ్వమని చెప్పారు.
బాధిత రైతు అటెండర్ యాదగిరికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్, అటెండర్‌పై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద కు చేరుకుని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తహసీల్దార్ నాగార్జునకు చెందిన మహబూబ్‌నగర్‌లోని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.