జగిత్యాల, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా..? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తుమ్మిడిహెట్టి నిర్మాణం చేపట్టరా..? మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించకపోవడం వెనుక మర్మం ఏంటీ?’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీమంత్రి టీ జీవన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం రూ. 1,100 కోట్లు కేటాయిస్తే, తుమ్మిడిహట్టికి రూ.52 కోట్ల కేటాయింపు వివక్ష కాదా..? అని నిలదీశారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల నేపథ్యంలో కాంట్రాక్టు అగ్రిమెంట్ పీరియడ్ డిఫెక్టివ్ లయబులిటీ కింద ఎల్అండ్టీ, నవయుగ కంపెనీ ద్వారా మరమ్మతులు చేయించవచ్చని పేర్కొన్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి నిర్మాణం పూర్తి కాకపోతే, గోదావరి, ప్రాణహిత నీటిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరలించుకుపోతారని ఆందోళన వ్యక్తంచేశారు.