చండూరు, జూలై 23 : ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చండూరు మండలం ఇడికూడ సర్పంచ్ పాల్వాయి రమాదేవి ప్రజలను కోరారు. కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అని ఆమె అన్నారు. గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న జీవన విధానం వల్ల వస్తున్న వివిధ రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కామినేని ఆస్పత్రి వారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం వల్ల నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
నిరుపేద ప్రజలకు వైద్యం వారి ఇంటి ముందుకే తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు బి.పి., షుగర్, కంటి, మోకాలు నొప్పులు, పంటి సమస్యలకు వివిధ పరీక్షలు నిర్వహించారు. మోకాలు, పంటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న 15 మందిని శుక్రవారం కామినేని హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి నర్సింహా, వార్డు మెంబర్లు నాంపల్లి విజయ, ఇరిగి నాగరాజు, కామినేని ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇడికూడలో కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం