ముంబై: నీట్ వివాదంపై జూలై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ చేపడతామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రకటించారు. తమ శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నించే వారిని చితకబాదుతామని రాజ్ ఠాక్రే హెచ్చరించారు. (Uddhav, Raj Thackeray) నీట్ పేపర్ లీక్ వివాదంతో పాటు ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇద్దరు నేతలు గురువారం తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన తెలియజేయడానికే ఈ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు వివరించారు.
కాగా, జూలై 26న తలపెట్టిన ఈ ఉమ్మడి నిరసన గురించి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో తాను మాట్లాడినట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని, అయితే విద్యార్థులు ఇకపై ఎవరికీ భయపడరని అన్నారు. ‘విద్యార్థులపై దాడి చేసి, మహిళా నిరసనకారుల దుస్తులు చించిన పోలీసుల బాధ్యతను ప్రధానమంత్రి తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు.
మరోవైపు ఈ నిరసన ర్యాలీ శివాజీ పార్క్ నుంచి ప్రారంభమై సిద్ధివినాయక ఆలయం వద్ద ముగుస్తుందని రాజ్ ఠాక్రే తెలిపారు. ఈ నిరసన సందర్భంగా ఎలాంటి రాజకీయ జెండాలను ప్రదర్శించబోమని చెప్పారు. విద్యార్థుల ఆందోళన భారీ స్థాయికి చేరడంతో ప్రభుత్వం వెనకడుగు వేసిందని విమర్శించారు. ‘జూలై 26న ముంబైలో మా శాంతియుత నిరసనకు భంగం కలిగించడానికి ప్రయత్నించే ఎవరినైనా మేం చితకబాదుతాం’ అని ఆయన హెచ్చరించారు.