హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : బాలల సంక్షేమంలో హోంశాఖ కీలకపాత్ర పోషించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ సూచించారు. సంక్షేమ శాఖతోపాటు హోంశాఖ కూడా సమన్వయంతో పని చేస్తే బాలల హక్కులను కాపాడొచ్చని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్ అకాడమీలో జువైనల్ జస్టిస్ కమిటీ ఆధ్వర్యంలో స్టేట్ స్టేక్ హోల్డర్స్ యాన్యువల్ కన్సల్టెంట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేఫ్ గార్డింగ్ ది గర్ల్‌చైల్డ్.. టువర్డ్స్ ఏ సేఫర్ అండ్ ఎనేబిలింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ హర్ ఇన్ ఇండియా’ అనే అంశంపై జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల విభాగాలు, వార్డు స్థాయి అధికారులు, అంగన్వాడీలు, ఆయాలు చిత్తశుద్ధితో పనిచేస్తే బాలల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాలల సంరక్షణకు అన్ని విభాగాలు సమన్వయంతో కృషిచేయాలని పిలుపునిచ్చారు.
పిల్లలు చదువుకొనేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మానవ వనరులను అందుబాటులో ఉంచాలని, తల్లిదండ్రులు, సమాజం పిల్లల బాధ్యత తీసుకోవాలని సూ చించారు. ప్రతి ఒక్కరూ లింగ భేదం లేకుండా బాలల అభ్యున్నతికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఏ బిడ్డనైనా.. తమ సొంత బిడ్డలా అక్కున చేర్చుకున్ననాడే బాల్యం మరింత భద్రంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా తాను జార్ఖండ్‌లో కొవిడ్ సమయంలో బాలల సంరక్షణ కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాలల చట్టాలు అమలుచేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. వెట్టిచాకిరీ నుంచి పిల్లలను తప్పించడంలో అన్ని విభాగాలు కీలకంగా పనిచేయాలని సూచించారు. ఎంతోమంది బాలికలకు సరైన గైడెన్స్ లేక ఎన్నో వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
యునిసెఫ్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా బాలల ఆత్మహత్యలు నాలుగు రెట్లు పెరిగాయని యునిసెఫ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలాలేమ్ బిర్హాను తఫెస్సే ఆందోళన వ్యక్తంచేశారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే అధికంగా ఉన్నారని తెలిపారు. దేశంలో మళ్లీ బాల్యవివాహాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జువైనల్ చట్టాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం షీటీమ్స్, భరోసా సెంటర్లు, యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటుచేసిందని, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా బాలల వెట్టిచాకిరీని అరికడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఉన్నతాధికారులు ప్రసంగించారు.