సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Tangallapalli) మేజర్ గ్రామపంచాయతీలో (Panchayathi Elections) సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే ఎన్నికల అధికారులు మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంకారపు రవీందర్ గుర్తు మార్పిడి చేయడం కలకలం రేపింది. శనివారం ప్రకటించిన జాబితాలో అంకారపు రవీందర్‌ని మొదటి పేరుగా ప్రకటించి.. ఉంగరం గుర్తు కేటాయించారు. అయితే జాబితాలో చివరి పేరు ఉన్న మోర లక్ష్మి రాజం ( కాంగ్రెస్ పార్టీ) అభ్యంతరం చేశారు. అయినప్పటికీ, శనివారం సాయంత్రం సర్పంచ్ అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు.

దీంతో కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో రాత్రికి రాత్రి గుర్తులను తారుమారు చేయించారు. హుటాహుటిన ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు మార్పు చేసి, రివైజ్ చేసి గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో పోలీసుల సహకారంతో అంటించారు. దీంతో మొదటి పేరుగా ఉన్న అంకారపు రవీందర్‌ను, జాబితాలో రెండో స్థానంగా ప్రకటించారు. మొదటి పేరుగా ఉన్నప్పుడు ఉంగరం గుర్తు కేటాయించారు. జాబితాలో రెండో పేరుగా రావడంతో కత్తెర గుర్తు కేటాయించి ప్రకటించడం గమనార్హం. దీంతో రెండో స్థానంలో ఉన్న మరో అభ్యర్థి ఇటికల మహేందర్ (బీజేపీ) మొదటి పేరుకు మారారు.

నిన్న ఉంగరం గుర్తుకేటాయించడంతో ప్రచార సామగ్రి, కరపత్రాలు భారీగా ఖర్చు చేసి అన్ని సిద్ధం చేసుకోవడం, తీరా రాత్రికి రాత్రే గుర్తులు మార్చడంపై ఎన్నికల అధికారులపై అంకారపు రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థుల జాబితాలో మొదటిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రవీందర్, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఇటుకల మహేందర్ ఉండగా, చివరి స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మోర లక్ష్మి రాజం అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ నేతల అధికార బలాన్ని ఉపయోగించి గుర్తులు మార్చినప్పటికీ, తన గుర్తు, స్థానం మారదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ నేత ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. సదరు కాంగ్రెస్ నేతపై ప్రజలు చీదరించింటున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి రవీందర్ తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ అయిన తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రవీందర్‌ను టార్గెట్ చేయడం మండల కేంద్రంలో హాట్ టాపిక్ మారింది.
