MP Raghunandan Rao | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు వ్యవహారసరళి బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారింది. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్నా మిన్నగా సీఎం రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్‌ను ఆయన వెనుకేసుకొస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో కూల్చివేతల్లో వేల కుటుంబాలు నిలువనీడలేక రోడ్డుపాలవుతున్నాయి. ఈ కూల్చివేతలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నతేడా లేకుండా రేవంత్సర్కార్పై ముప్పేటయుద్ధం ప్రకటిస్తున్నాయి. కానీ, ఎంపీ రఘునందన్‌రావు మాత్రం సీఎం రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా నిలుస్తున్నట్టు ఆయన మాటలే వెల్లడిస్తున్నాయి. ‘ఏండ్ల తరబడి నీళ్లల్ల కట్టిన ఇండ్లను కూల్చాల్సిందే. ఆ ఇండ్లకు బ్యాంకు లోన్లు ఉన్నా కూల్చివేయాల్సిందే. అలా కూల్చటం చేతకాకపోతే హైడ్రా కమిషనర్ పక్కకు తప్పుకుంటే మంచిది’ అని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని సూచించారు.
ఆయన రూటే సెపరేటు
పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల పక్షాన ఉంటే ఒక్క రఘునందన్‌రావు మాత్రమే సీఎంను వెనకేసుకు రావటంలో ఆంతర్యం ఏమిటని బీజేపీలో చర్చ జరుగుతున్నది. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కన్నా ఎక్కువగా రఘునందన్‌రావు ఎందుకు మీదేసుకుంటున్నారు? అన్న చర్చ సాగుతున్నది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. న్యాయస్థానాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.