సారంగాపూర్, జూలై 8: స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో ఇప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే రిజర్వేషన్లపై (Reservations) మళ్లీ సందిగ్ధత నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత, ఇతర అంశాలతో రిజర్వేషన్ల ప్రస్తావన కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లే ప్రాధాన్యత సంచరించుకుంటాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు కావడంతో ప్రధానంగా పార్టీలకంటే స్థానిక నాయకులు, దృష్టి సారిస్తారు. పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలు కొద్ది రోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
ఆశావాహులు మద్దతు కూడగట్టుకునేందుకు అంతర్గత ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కొందరు కొన్ని గ్రామపంచాయతీలో విందులు కూడా ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నందున ఇక రంగంలోకి అప్పుడే ఆశవాహులు రంగంలోకి దిగిపోయారు. పార్టీల మద్దతు కోసం మండల బడా నాయకుల చుట్టూ ఆశావాహులు తిరుగుతున్నారు. అయితే రిజర్వేషన్ల సంగతి ఆశావాహులను సందిగ్ధంలో పడేసింది.
పాత రిజర్వేషన్ల…? కొత్త రిజర్వేషన్ల…?
2019 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 10 సంవత్సరాలు కొనసాగాలి. ఇప్పటికీ ఐదేళ్లు గడిచిపోయి మరో ఐదేళ్లపాటు అవే రిజర్వేషన్లు కొనసాగాలి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనేది సంసిద్ధంగా మారింది. మారిన రాష్ట్ర రాజకీయాలతో సమీకరణాలు మారుతాయని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృశ్య పాత రిజర్వేషన్లు ఆధారంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఇందులో కూడా సామాజిక సమీకరణాల నేపథ్యంలో రిజర్వేషన్ల సంఖ్య మారే అవకాశం ఉంది. అయితే పాత రిజర్వేషన్లు ఉంటాయని నమ్మకంతో కొందరు, మారుతాయని ధీమాలో మరికొందరు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు మారాయని, కొత్త రిజర్వేషన్లు మండల కేంద్రానికి వచ్చాయని పుకార్లు కూడా శికార్లు చేస్తున్నాయి.
రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం సన్నాహాలు..
రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సారంగాపూర్ మండలంలో 32 గ్రామపంచాయతీలు, 282 వార్డులు ఉన్నాయి. అలాగే 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానం ఉంది. మండలంలో మొత్తం 39,549 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 18,392, స్త్రీలు 21,155 మంది ఓటర్లు ఉన్నారు. ఇది ఇలా ఉంటే 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ఆధారంగా మండలాధికారులు జిల్లా అధికారులకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం 27 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించింది. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేపట్టింది.
దీని ఆధారంగానే రిజర్వేషన్లు చేపడుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 42 శాతం బీసీలకు కేటాయిస్తే 8 శాతం మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందని దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. ఈసారి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపీట వేయడం మాత్రం స్పష్టంగా కనిపి స్తోంది. కొద్ది రోజుల్లోనే ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఆశావాహులు ఇప్పటినుండే గ్రామాల్లో ఓటర్లను కలుస్తున్నారు.