Jagadish Reddy | సూర్యాపేట : ఖమ్మం మంత్రుల వల్లే సాగర్ ఎడమ కాల్వకు గండి పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను రైతులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగిందని రైతులు చెబుతున్నట్లు జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతాన్ని హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలకు, రైతులకు ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు బృందం ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసీఆర్‌పై, మా పార్టీ పై విమర్శలు చేశారు. పెళ్లికి, చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఓదార్పుకు వచ్చారా..? సంబరాలకు వచ్చారా..? అర్థం కావడం లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
ఈ కాల్వకట్ట దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే. రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్టమీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారు. గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు. కేవలం అధికార పార్టీ మంత్రులు చేసిన నిర్వాకం వల్లే తెగింది. ఖమ్మంలో నిన్న కొట్టుకుపోయి ప్రజలు చనిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
9 గంటలుగా సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. చీకటి పడ్డాక కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొసలి కన్నీళ్లు కార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాల్లో మునిగితేలుతున్నారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విలయం, ప్రకృతి సృష్టించిన విలయం కాదు. పంట నష్టపోవడమే కాక మరో రెండు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రైతులు తమ పొలాలను బాగుచేస్తే చాలు మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి ఇలాకాలో ప్రభుత్వ స్థలాలు కబ్జా
Sangareddy | సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతలు.. ఐలాపూర్ తండాలో 20 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు
Edupayala Temple | జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గా భవాని..