ఆత్మకూర్.ఎస్, మే 14: తరుగు పేరిట 25 క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారంటూ ఓ రైతు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో చోటుచేసుకున్నది. రైతు బొల్ల శేఖర్‌రెడ్డి 20 ఎకరాలు సాగు చేయగా మొదటి విడతగా 505 బస్తాలు విక్రయించాడు.
మిల్లర్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉన్నదన్న సాకుతో 25 క్వింటాళ్ల డబ్బులు రాకుండా చేశారని ఆవేదన చెందాడు. మరో 600 బస్తాలకుపైగా కొనుగోలు కేంద్రంలో పది రోజులుగా ఉన్నా కాంటా వేయడం లేదని ఆందోళన చెందుతూ గురువారం ఒంటిపై, ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పంటించుకొనే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న రైతులు అడ్డుకున్నారు.