Jagadish Reddy | హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ గుండాలు చేసిన పని అని విమర్శించారు. ఇటువంటి చిల్లర వేషాలకు భయపడమని స్పష్టం చేశారు. ఎంతోమంది రాక్షసులను తరిమికొట్టామని తెలిపారు. కేసీఆర్ ముందు ఇలాంటివి నడవవని.. ఆయశ శిఖరం వంటి వారని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు.
రుణమాఫీ విషయంలో అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా మోసం చేసిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దాడులను మొదలుపెట్టారని అన్నారు. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతుకోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీకి మొదట 40వేల కోట్లు అవుతాయని మేనిఫెస్టోలో చెప్పారని.. ఆ తర్వాత 31వేల కోట్లు అని కేబినెట్లో చెప్పారని.. ఆ తర్వాత 27వేల కోట్లు అని చెప్పారని.. ఆఖరకు 17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. ఇవాళ రైతులు తిరగబడుతున్నారని.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కావాలనే ప్రజలను పక్కదారి పట్టించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. ఒక్కసారి ఆలోచన చేయాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ మిమ్మల్ని దగా చేస్తుందని.. మోసం చేసిందని అన్నారు.
రేవంత్ రెడ్డి బీజేపీతో దొంగ సంబంధాలు పెట్టుకున్నాడని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డినే దొంగలాగా బీజేపీతో మిలాఖత్ అయ్యాడని విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు అని అన్నారు. రాష్ట్రంలో హింస ప్రేరేపించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసం, పచ్చి అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఇప్పటికైనా గ్రహించాలని రైతులకు సూచించారు. రైతుల తరఫున బీఆర్ఎస్ కొట్లాడుతుందని.. రైతులకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని, అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని రైతులంతా ఏకమవ్వాలని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.