ముషీరాబాద్, జనవరి 28: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే ఫిబ్రవరి 6వ తేదీన మహాదీక్ష చేపడతామని హెచ్చరించారు. విద్యానగర్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్రెడ్డి, ప్రస్తుతం కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులోనే బిల్లు పెట్టేదని, అలా కాకుండా రాష్ర్టాలకు అప్పగించి చేతులు దులిపేసుకున్నదని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగకు వర్గీకరణ ఇష్టం లేనట్లుందని, అందుకే వర్గీకరణ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా చావుడప్పు కొడతామని ప్రటించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు రమేశ్, గణేశ్, శ్రీనివాస్, హుస్సేన్, శ్రీను పాల్గొన్నారు.