హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి-కొత్తగడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీంకో ర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవా రం తుది తీర్పు వెల్లడించింది. తద్వారా దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి తెరదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
రెవెన్యూ రికార్డులు కేవలం పన్ను వసూళ్లకే ఉపయోగపడతాయని స్పష్టం చేసింది. ఇదే అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. 1950లో నాటి ప్రభుత్వం జారీచేసిన ఫారెస్ట్ నోటిఫికేషన్ను సవాలు చేసిన అప్పీలుదారులు ఆ భూమి తమదేనని నిరూపించుకునేందుకు ఎలాంటి ఒరిజినల్ పత్రాలను సమర్పించలేదని పేర్కొన్నది. 1950 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆ 600 ఎకరాలు అటవీ భూములేనని తీర్పు చెప్పింది.