హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులు జరిగి ఏడాది దాటిపోయిందని.. ‘ఫిరాయింపు వార్షికోత్సవం’ చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేసింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, సీఏ సుందరం వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం, అనర్హత పిటిషన్ విచారణార్హతను స్పీకర్ పరిశీలించాలని న్యాయవాదులు తెలిపారు.
అర్హత లేకుంటే పిటిషన్‌ను తిరసరించాలని, విచారణార్హత ఉంటే స్పీకర్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వాటికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారంలో సమాధానం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. కానీ పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని చెప్పారు. దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టులో విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా స్పీకర్ కార్యాలయం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయలేదని పేరొన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒకరు కాంగ్రెస్ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ.. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం ఉండాలి? మొదటి ఫిర్యాదు నుంచి ఇప్పటివరకు ఎంత సమయం గడిచిందని అడిగారు. దాదాపు ఏడాది గడిచిందని న్యాయవాదులు చెప్పగా.. ‘ఫిరాయింపుల వార్షికోత్సవం జరిగిందా?’ అని జస్టిస్ గవాయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ధర్మాసనం విచారణ జరిపి ‘తగిన సమయం అంటే ఎంతకాలం?. వారి పదవీకాలం పూర్తయ్యే వరకా?’ అని ప్రశ్నించిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించిందని తెలిపారు. అయితే స్పీకర్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిందని, ఎమ్మెల్యేల సమాధానాలు ఏమయ్యాయో తమకు తెలియదని న్యాయవాదులు పేరొన్నారు.
ఇలాంటి కేసుల్లో ముగ్గురు, ఐదుగురు సభ్యుల ధర్మాసనాలు కొన్ని తీర్పులు ఇచ్చాయని, ఐతే.. తగిన సమయం అంటే ఎంతో స్పష్టంగా చెప్పలేదని ధర్మాసనం పేర్కొంది. అలాంటప్పుడు తాము ఉన్నత ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను కాదని ఎలా వెళ్లగలమని ప్రశ్నించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని వ్యాఖ్యానించింది. దీనిపై అర్యమ సుందరం స్పందిస్తూ.. తగిన సమయం అనే విషయంలో ఒకో కేసులో ఒకో విధంగా నిర్ణయాలు జరిగాయని గుర్తు చేశారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని తాము కోరడం లేదని చెప్పారు.
అయితే రాజ్యాంగం కల్పించిన హకులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉందని తెలిపారు. ఒకవేళ అలా జరగడం లేదని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. అలాంటి సందర్భంలో.. రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం న్యాయసమీక్ష అధికారం కోర్టులకు ఉందని తెలిపారు. కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశాలున్నాయి.