హైదరాబాద్ సిటీబ్యూరో, కొండాపూర్ ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ విద్యార్థుల, అధ్యాపకుల పోరాటం ఫలించింది.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆరాటానికి తెరపడింది.. పర్యావరణ వేత్తల ప్రయత్నం సఫలమైంది.. మేధావులు, సినీరంగ ప్రముఖుల అభిప్రాయాలకు విలువ దక్కింది.. ఎట్టకేలకు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో వారందరితోపాటు ఆ భూముల పరిరక్షణ కోరుకున్న రాష్ట్ర ప్రజానీకంలో ఆనందం వెల్లివిరిసింది. ఐదో రోజైన గురువారం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో రేవంత్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ దమనకాండను తక్షణమే నిలిపేయాలంటూ నినాదాలు, పాటల రూపంలో నిరసనను హోరెత్తించారు.
హెచ్‌సీయూలోని అన్నీ సంఘాల విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. యూనివర్సిటీ నుంచి రాకపోకలు సాగించకుండా పోలీసులు మెయిన్‌గేట్‌కు తాళం వేయడంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మెయిన్ గేట్ తాళం తీయాలంటూ పోలీసులతో వాదనకు దిగారు. పోలీస్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను లోపలికి నెట్టివేశారు. విద్యార్థులు గేటు వద్దే కూర్చొని తమ నిరసనను కొనసాగించారు. అరుదైన జంతు సంపద, విలువైన చెట్లను చెరబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు మిన్నంటాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రార్ యూనివర్సిటీ లోపలికి రాగానే పోలీసులు గేట్లన్నింటినీ తెరిచారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిలో అరుదైన వృక్ష, జంతు సంపద భూస్థాపితం అవుతుండటంతో అక్కడి పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాత్రి నుంచి ఉదయం 11 గంటల దాకా చెట్ల నరికివేతను కొనసాగించిన అధికారులు రిజిస్ట్రార్ వస్తున్నారన్న సమాచారంతో పనులను నిలిపేశారు. ఆ ప్రాంతం నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన రిజిస్ట్రార్ 400 ఎకరాలతోపాటు యూనివర్సిటీలో దాదాపు 5 కిలోమీటర్ల మేర కలియ తిరిగారు.
విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి నేతలతో మాట్లాడి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. అక్కడున్న పరిస్థితిని నమోదు చేసుకొని వెళ్లిపోయారు. రిజిస్ట్రార్ బయటకు వెళ్లగానే గేట్ల మూసి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను బయటకు వెళ్లనీయకుండా క్యాంపస్ లోపలే నిర్బంధించారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థులు భగ్గుమన్నారు. గేట్లను మళ్లీ ఎందుకు మూస్తున్నారంటూ గొడవకు దిగారు. అప్పటిదాకా ఉన్న కర్ఫ్యూ వాతావరణం మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. విద్యార్థులు నిరసన విరమించారు. తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశంతో హెచ్‌సీయూ విద్యార్థుల ముఖాల్లో ఒక్కసారిగా వెలుగులు విరబూశాయి. మెయిన్ గేట్ బయటకు వచ్చి డప్పు చప్పుళ్లతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబురం చేసుకున్నారు. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి.. అంటూ నినదించారు.
రియల్టర్‌తో జరిగిన ఉద్యమంలో రీసెర్చర్లు విజయం సాధించారు. హెచ్‌సీయూ జోలికి ఎవరొచ్చినా ఇలాంటి గుణపాఠమే చెప్తాం. సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగాన్ని కాపాడుతుందని మరోసారి రుజువైంది. ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే ఎంతటివారికైనా పరాభవం తప్పదని తేలింది. ప్రభుత్వం తొందరగా నిపుణుల కమిటీ వేసి నెలలోగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి. మా ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నేతలకు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులకు ధన్యవాదాలు.
– వేణు, పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, హెచ్‌సీయూ
ఇప్పటికైనా రేవంత్ సర్కారు బుద్ధి తెచ్చుకొని జీవైవివధ్యం, యూనివర్సిటీ భూములను పరిరక్షించే చర్యలు చేపట్టాలి. ఇప్పటికైనా మౌనం వీడి హెచ్‌సీయూ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అడ్మినిస్ట్రేషన్ చొరవ చూపాలి. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం విద్యార్థుల విజయం. సోషల్ మీడియాలో మాకు బాసటగా నిలిచినవారికి కృతజ్ఞతలు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. హెచ్‌సీయూ విచ్ఛిన్నానికి కుట్రలు చేస్తే మళ్లీ కొట్లాడుతం.
– అతీఖ్ అహ్మద్, పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, హెచ్‌సీయూ
హెచ్‌సీయూ పోరాటానికి పెద్ద గుర్తింపు లభించింది. పర్యావరణాన్ని కాపాడాలనే విద్యార్థులు, ప్రొఫెసర్ల ఉద్యమానికి ఫలితం దక్కింది. విద్యాభివృద్ధికి దోహదపడాల్సిన భూములను లాక్కోవడం ముమ్మాటికీ తప్పని నిరూపితమైంది. ఇలాంటి సందర్భంలో కోర్టులు స్పందించడం హర్షనీయం. జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి బాసటగా నిలవడం గొప్ప విషయం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టి రాష్ర్టాన్ని పురోగమనంలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. పోలీసుల నిర్బంధానికి భయపడకుండా పోరాడిన విద్యార్థులకు అభినందనలు.
– పిల్లలమర్రి రాములు, ప్రొఫెసర్, హెచ్‌సీయూ