హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ధ్వంసం చేసిన 400 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించేందుకు చేపట్టబోయే ప్రణాళికపై నివేదిక రూపొందించి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేయడానికి అనుమతించాలని కోరుతున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆ 400 ఎకరాల భూమిలో చెట్లు లేవని.. అది అడవే కాదని మరోసారి వితండవాదం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) నివేదకనే తప్పు పట్టారు. కేసులో ఉన్న సారాంశాన్ని మార్చి సీఈసీ కోర్టుకు నివేదించిందంటూ నిందలేశారు. ఏండ్ల తరబడి సహజసిద్ధంగా ఏర్పడిన జీవావరణం అడవి కాదని అఫిడవిట్లో పేర్కొన్నారు.
విధ్వంసం సృష్టించిన ప్రాం తంలో మొక్కలు నాటాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించినా.. మళ్లీ పాత పాటనే పాడటం విస్మయం కలిగిస్తున్నది. అది అడవా? కాదా? అన్న అంశాన్ని వదిలేసి అక్కడ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ సీఎస్ సమర్పించిన అఫిడవిట్లో ఆ ప్రస్తావనే లేకుండా కేవలం 400 ఎకరాల పుట్టుపూర్వోత్తరాలనే పేజీల కొద్దీ రాసుకొచ్చింది.
దీంతో ప్రపంచంలో ఉన్న అడవులన్నీ సహజసిద్ధంగానే ఏర్పడ్డాయనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అంటూ పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ 400 ఎకరాల్లో శాటిలైట్ ద్వారా 1447 చెట్లు మాత్రమే ఉన్నట్టు గుర్తించామని సీఎస్ తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు చూస్తుంటే 1447 చెట్లున్న ప్రాంతంలో వందలాది జంతు జాతులు, వృక్షజాతులు ఎలా బతుకుతున్నాయని మేధావులు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాష్ట్రంలోని 17 ఇండస్ట్రియల్ పార్కుల్లోని 137ఎకరాల్లో 40,500 మొ క్కలు నాటినట్టు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అన్ని మొక్కలు నాటిన టీజీఐఐసీ ఏండ్ల తరబడిగా సహజసిద్ధంగా పెరిగిన 400 ఎకరాల అడవిని ఎలా ధ్వంసం చేస్తుందని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. విలువైన ఔషధ గుణాలు, నగరానికి ఊపిరితిత్తుల వంటి వేలాది చెట్లను నరికేసి మొక్కలను నాటుతారా? అని నిలదీస్తున్నారు. సహజసిద్ధమైన కొండలు, శిలలు, ఔషధ విలువలు కలిగిన మొక్కలు, విలువైన జీవావరణం ఉందని చెప్తూనే వాటిని తొలగించి ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామనడం సిగ్గుచేటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.