హైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అభివర్ణించారు. గురుకుల విద్యాశాఖ టెండర్ల కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సంబంధిత ప్రైవేట్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు శనివారం ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 18కి కోర్టు వాయిదా వేసిందని, దీనిపై ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.
గురుకులాల్లో పిల్లల నిధులను, ప్రజాధనాన్ని దోచుకొంటున్న ముఠాపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెనుకడుగు వేయకుండా పోరాడారని కొనియాడారు. ‘హైకోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, అనేక ఒత్తిళ్లు వచ్చినా సుదర్శన్‌రెడ్డి లొంగలేదు. ఆయన వేసిన చట్టబద్ధమైన న్యాయపోరాట పునాదే నేడు సుప్రీంకోర్టు నోటీసులకు కారణమైంది’ అని ఆయన తెలిపారు.పిల్లల సొమ్మును దారిమళ్లించిన కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, ఢిల్లీ లాయర్లతో లాబీయింగ్ చేసి అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించిన ఈ న్యాయపోరాటాన్ని బీఆర్ఎస్ పార్టీ చివరివరకు తీసుకెళ్తుందని, అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు.