హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంకెంతకాలం సాగదీస్తారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను సూటిగా ప్రశ్నించింది. నిందితుడు ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఐదు ఐఫోన్ పాస్‌వర్డ్‌లలో కేవలం రెండింటి రీసెట్‌కు మాత్రమే సహకరించారని న్యాయవాదులు సమాధానమిచ్చారు. ఆ రెండింటిలో కూడా ఎలాంటి డాటా లేదని, మరో మూడు ఐడీలు ఓపెన్ కాలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా ఏమి డాటా కావాలని కోరుకుంటున్నారని న్యాయవాదులను న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణను తిరిగి గురువారానికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న ధర్మాసనం ప్రభాకర్‌రావుకు రక్షణ కల్పించి దర్యాప్తునకు సహకరించాలని గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.