Supreme Court | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టి తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత అనుభవాలనుంచి పాఠం నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉపఎన్నికలు రావని సీఎం చెప్పారని తెలిపారు.
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశం గురించి మాట్లాడవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నా సీఎం పట్టించుకోలేదని, నాకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతా అనే తరహాలో ప్రవర్తించారని చెప్పారు. ‘హరీశ్‌రావు బాగా గుర్తు చేశారు. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉన్నది. సబ్‌జ్యుడీస్ అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉన్నది కానీ, బయట మాట్లాడితే ప్రొటెక్షన్ ఉండదు. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ . అధ్యక్షా.. తమరి నాయకత్వంలో సభకు రక్షణ ఉన్నది. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించొచ్చు. కానీ సభ బయట, ఉప ఎన్నికలు వస్తయ్ .. అయిపోయింది.. వచ్చేవారమే ఎన్నికలు! ఇదంతా ఉత్తదే అధ్యక్షా! అదేం జరిగేది లేదు, పొయ్యేది లేదు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఉపఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన పనిలేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారని తెలిపారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ముఖ్యమంత్రి కనీసం కొంత సంయమనం పాటించాలని అనుకోలేదా? ఆ సమయంలో (గతంలో) మేము చర్యలు తీసుకోకుండా, ధికరణ నోటీసులు జారీ చేయకుండా తప్పు చేశామా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలపై తమకు ఇబ్బంది లేదని, అయితే.. ఒక వ్యక్తి గత అనుభవాల నుండి పాఠం నేర్చుకోకుండా.. ఏడాది గడవకముందే మరోసారి అలా ప్రవర్తించడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలోని ఇతర రెండు విభాగాలను మేము గౌరవిస్తాం. వాళ్ల నుండి కూడా మేము అదే ఆశిస్తాం’ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో స్పీకర్ మౌనంగా ఉన్నారని ఆర్యమ సుందరం గుర్తుచేశారు. అలాంటప్పుడు స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.
‘ఒకవైపు స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోవద్దని వారు అంటున్నారు. మరి నాలుగేండ్లపాటు నిర్ణయం తీసుకోకపోతే ఎలా అని అడిగితే అసాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చని చెప్తున్నారు’ అని ఆర్యమ సుందరం గుర్తుచేశారు. ‘హైకోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి కోర్టులో పెండింగ్‌లో ఉన్నది వారు వేసిన పిటిషనే’ అని గుర్తుచేశారు. కాబట్టి వారు చేస్తున్న వాదనలో పసలేదన్నారు. స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతున్నదని తెలిపారు.
ఒకవేళ ఈ అంశంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేకుంటే, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గతంలో తీర్పులు ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బట్టి వారి ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను స్పీకర్‌కు ఆపాదించడం సరైనది కాదని తనకు తెలుసని.. అయితే సీఎం మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఏమాత్రం స్పందించలేదని గుర్తుచేశారు. కనీసం తన ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సీఎంను అడ్డుకోలేదన్నారు. కాబట్టి స్పీకర్ చర్యలు తీసుకుంటారని తమకు నమ్మకం లేదన్నారు. ఈ నేపథ్యంలో గడువును నిర్ధారించే సమయం ఆసన్నమైందని చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఒక కేసులో తప్ప ఇప్పటివరకు స్పీకర్‌కు నిర్ణీత సమయం విధించిన దాఖలాలు లేవని పేరొన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ.. ‘మీ దృష్టిలో సరైన సమయం అంటే ఎప్పటివరకు?. రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే.. మేము (కోర్టు) 2028 జనవరి- ఫిబ్రవరి వరకు ఎదురు చూడాలా?’ అని ప్రశ్నించారు. అది జరగదని అన్నారు. తాము స్పీకర్ నుంచి కొంత పారదర్శకత కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. చట్టాన్ని సరిగ్గా అమలు చేయడంలో న్యాయవాదులు కూడా కోర్టుకు సహకరించాల్సి ఉంటుందని అన్నారు.
తాము స్పీకర్‌కు షరతులు విధించడం లేదని, అనర్హత పిటిషన్లపై ఎంత సమయంలోపు చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ‘కోర్టు ఆఫీసర్‌గా మీరే చెప్పండి. పిటిషన్ ఇచ్చినప్పటినుండి ఆరు నెలల సమయం సరిపోదా?’ అని సింఘ్వీని ప్రశ్నించారు. అనర్హత పిటిషన్లు ఇచ్చి 14 నెలలు గడిచిపోయిందని, అయినా ఇప్పటికీ కోర్టులు జోక్యం చేసుకోవద్దా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
దీనిపై సింఘ్వీ స్పందిస్తూ.. పిటిషన్ ఇచ్చిన వారం రోజుల్లోనే కోర్టును ఆశ్రయించడం ఎప్పుడైనా చూశారా? కాబట్టి పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. స్పీకర్‌ను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టంచేశారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. అలాంటప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును గౌరవించి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వకుండా ఉండాల్సిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే ప్రక్రియ మొదలు పెట్టాల్సిందని చెప్పారు. ‘మీరు రెండు రకాల వాదనలు చేయొద్దు. ప్రతిరోజు ముఖ్యమైనదే’ అని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.