హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) ; పార్టీ ఫిరాయించిన (MLAs Defection) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై (BRS) చర్యలు మరింత ఆలస్యం కానున్నాయా? ఇప్పుడప్పుడే ఈ అంశం తేలే అవకాశం లేదా? సుప్రీంకోర్టు విధించిన గడువులోపు చర్యలు తీసుకోకుండా మరింత కాలం కేసును సాగదీస్తారా? అంటే రాజకీయ, న్యాయనిపుణులు అవుననే అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ నెలాఖరులోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశా న్ని తేల్చాలని, స్పీకర్ విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ విషయంలో శాసనసభ, స్పీకర్ కార్యాలయం దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిన తర్వాతనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి నెల రోజుల క్రితమే విచారణ షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకా రం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు కేవలం గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్ల విచారణ మాత్రమే పూర్తిచేశారు. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ మిగిలి ఉన్న ది. దీంట్లో అత్యంత కీలకమైన ఖైరతాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ ఇంకా నోటీసులు ఇవ్వలేదు. వీరికి నోటీసులు పంపడం, వారు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన సమాధానాల ఆధారంగా మళ్లీ విచారణకు పిలువడం ఇప్పుడప్పుడయ్యే పనికాదని న్యాయనిపుణులు చెప్తున్నారు.
నలుగురి ఆధారాలతోనే హైరానా!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురి విచారణతోనే అధికార పార్టీలో హైరా నా మొదలైనట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని సాక్ష్యాలను తీసుకువచ్చి ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న స్పీకర్ ఎదుట పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ ఫిరాయించలేదని, తమకు ఫిరాయిం పు చట్టం వర్తించదని నోటిమాటగా చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలను బీఆర్ఎస్ ట్రిబ్యునల్ ముందుపెట్టి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ఇరువర్గాల తరఫున న్యాయవాదులు కూడా విచారణలో పాల్గొన్నారు. ఇక వారి విషయంలో తీర్పు చెప్పడమే ఆలస్యమని అంటున్నారు.
దాటవేత ధోరణే..
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు విచారణ ప్రారంభమైనప్పటికీ తుదివిచారణపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కేవలం విచారణ మొదలుపెట్టారు. కీలకమైన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలపై పోటీచేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి వారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగి, వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటే కొంతైనా నమ్మకం ఏర్పడేదని, అలాకాకుండా విచారణ ప్రక్రియను సాగదీసే ధోరణే కనిపిస్తున్నదని నిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. ఇంకా ఆరుగురి విచారణ జరగనేలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పినట్టు మూడు నెలల్లో విచారణ ముగిసే అవకాశం కనిపించడంలేదు.