హైదరాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జస్టిస్ వినోద్‌కుమార్ 2019 ఆగస్టు 19న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బది లీ చేయాలని కూడా కొలీజియం నిర్ణయించింది.
తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్‌జస్టిస్‌గా అపరేశ్కుమార్సింగ్ను నియమించాలని కొలీజియం 26న కేంద్రానికి సిఫార్సు చేసిన అధికారిక పత్రం బుధవా రం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏకే సింగ్ బదిలీపై తెలంగాణకు రానున్నారు.
జస్టిస్ పాల్, జస్టిస్ వినోద్‌కుమార్ బదిలీ కాగా కొత్త గా చీఫ్ జస్టిస్‌తో పాటు మరో ము గ్గురు న్యాయమూర్తులు (కర్ణాటక నుంచి జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత, పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అభిషేక్‌రెడ్డి) తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరనుంది. 11 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటాయి. నాలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకోగా, అందులో తెలంగాణకు చెందిన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జార్ఖండ్ హైకోర్టు సీజేగా వెళ్లనున్నారు.