దోమలపెంట, జూన్ 10 : ‘పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందట!’.. నాగార్జునసాగర్ నిర్మించాం.. శ్రీశైలం కట్టాం.. అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. దాదాపు రెండున్నర దశాబ్దాల్లో తెలంగాణ గడ్డపై తలపెట్టి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. ప్రాణహిత-చేవెళ్లలో తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించలేక తోక దగ్గర కాల్వలు, టన్నెళ్లు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు మింగేశారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల్లో కాల్వలు తవ్వి నీటి ఎత్తిపోతలను అటకెక్కించారు. శ్రీశైలం సొరంగం పేరిట కొత్త టెక్నాలజీని తెచ్చిపెట్టి తెలంగాణ నెత్తిన ఓ గుదిబండను మోపారు. చివరికి ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చి ఆ సొరంగాన్నీ కుప్పకూల్చారు.
ఇలా ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంలో తాజాగా మరో కలికితురాయి తెరపైకి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులు దేవురుడెరుగు.. ఒక చిన్న చెక్‌డ్యాం లాంటి నిర్మాణాన్ని కూడా పటిష్టంగా పూర్తి చేసి వినియోగంలోకి తేలేని దుస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ డ్యాం పూర్తయితే శ్రీశైలంలో 365 రోజుల పాటు రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అది ధ్వంసమై వంద కోట్ల రూపాయలు ‘కృష్ణా’ర్పణమయ్యాయి. కాంగ్రెస్ కిరీటంలో ఇన్ని ఘనకార్యాలు పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగిపోతే ఆ పార్టీ ప్రభుత్వం చేసే రంధ్రాన్వేషణ.. ప్రభుత్వ పెద్దలు వల్లించే నీతి వ్యాఖ్యాలను చూస్తుంటే ‘నవ్విపోదురుగాక!’ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో భాగంగా రివర్సబుల్ మోడ్‌లో కూడా టర్బైన్లు తిరుగుతాయి. దీని ద్వారా డ్యాం దిగువన ఉన్న జలాలను తిరిగి డ్యాంలోకి ఎత్తిపోసి.. తిరిగి అదే నీటితో కరెంటు ఉత్పత్తి చేసి దిగువకు వదులుతారు. ఈ క్రమంలో రివర్సబుల్ పంపింగ్ జరగాలంటే నాగార్జునసాగర్‌లో కనీసం 530 అడుగుల నీటిమట్టం ఉండాలి. తద్వారా విద్యుత్తు కేంద్రంలోకి వెళ్లే ఎగ్జిట్ టన్నెల్‌కు నీళ్లు అందుతాయి. ఈ టన్నెల్ డ్యాం దిగువన రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాగర్‌లో నీటిమట్టం పడిపోతే ఈ రివర్సబుల్ పంపింగ్ నిలిచిపోతుంది. ఇలా కాకుండా 365 రోజులూ రివర్స్ పంపింగ్ జరగాలంటే టన్నెల్లోకి నీటి లభ్యత ఉండాలి. ఇందుకోసం 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వజ్రాలమడుగు దగ్గర డ్యాం దిగువన 14వ కిలోమీటరు వద్ద సపోర్ట్ డ్యాం (చెక్డ్యాంలాంటి నిర్మాణం) కట్టాలని నిర్ణయించింది. దీని నీటి నిల్వ సామర్థ్యం టీఎంసీ. దీని ద్వారా సాగర్‌లో నీటిమట్టం పడిపోయినా 14 కిలోమీటర్ల వరకు నీటి లభ్యత అంటే టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుంది. దీంతో రివర్స్ పంపింగ్ చేయవచ్చు.
తిరిగి డ్యాం నుంచి నీటిని వదిలినా ఈ సపోర్ట్ డ్యాంలోనే ఉంటాయి. ఇలా ఏడాది పొడవునా రివర్స్ పంపింగ్‌కు వెసులుబాటు ఉంటుంది. జల విద్యుదుత్పాదనలో భాగంగా నాన్ పీక్ అవర్స్‌లో బహిరంగ మార్కెట్లో కరెంటు రేటు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో యూనిట్‌కు దాదాపు రూ.4-5 వరకు కరెంటు దొరికినపుడు ఈ డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా డ్యాంలోకి ఎత్తిపోస్తారు. పీక్ అవర్స్‌లో డ్యాం నుంచి జల విద్యుత్తు కేంద్రంలో అదే టీఎంసీ నీటితో కరెంటు ఉత్పత్తి చేసి దిగువకు వదులుతారు. దిగువ నుంచి ఎగువకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు 6.6 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చయితే.. అదే టీఎంసీ నీటిని డ్యాం నుంచి దిగువకు వదిలే సమయంలో 5.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. పీక్.. నాన్ పీక్ అవర్స్ ప్రామాణికంగా ఈ ప్రక్రియలు చేపడుతున్నందున కరెంటు ఉత్పత్తిలో ఇదో కీలక ప్రాజెక్టుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం గంగపాలు చేసింది. దీంతో ఇప్పుడు నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 530 అడుగుల కంటే తక్కువగా ఉండటంతో రివర్స్ పంపింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి సాగర్‌కు ఇన్‌ఫ్లో వచ్చే వరకు రివర్స్ పంపింగ్ అనేది జరగదు.
2004లో శ్రీశైలం డ్యాం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో సాగర్‌కు నీళ్లు వెళ్లే చోట సుమారు రూ.130 కోట్లతో నిర్మాణ పనులకు నాటి కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచింది. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన పటేల్ కంపెనీనే రూ.100 కోట్లకు టెండర్ దక్కించుకున్నది. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 512 మీటర్ల పొడవు.. 170 మీటర్ల ఎత్తుతో టెయిల్ పాండ్ నిర్మాణం చేపట్టారు. రెండేండ్ల పాటు దాదాపు 65 మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తయ్యే వరకు అటవీ శాఖ పర్యావరణ అనుమతులు లేవన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2006-2009 వరకు పనులు నిలిచిపోయాయి. సదరు కాంట్రాక్టు సంస్థ చేసిన పనులకు జెన్కో నుంచి రూ.36 కోట్లు చెల్లించారు. 2010లో అటవీ శాఖ ఇబ్బందులతో అసంపూర్తిగా చేసిన పనులను వదిలేసిన పటేల్ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసుకున్నది. తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 2010లో హైదరాబాద్‌కు చెందిన బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ పనులు ప్రారంభించింది. 512 మీటర్ల పొడవులో ఉన్న టెయిల్ పాండ్ ఎడమ వైపు 170 మీటర్ల ఎత్తు వరకు ఉంటే 35 మీటర్ల వరకు పనులు పూర్తి చేసింది. మిగితా 164.7 మీటర్ల ఎత్తుకు కాంక్రీట్ పనులు జరిగే సమయంలో 2015 నవంబర్ 19న శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో అన్ని యూనిట్లలో విద్యుదుత్పత్తి చేసి దాదాపు 40 వేల క్యూసెక్కులు విడుదల చేయడంతో చివరి దశ నిర్మాణ పనుల్లో ఉన్న సపోర్ట్ డ్యాంకు గండి పడింది.
డ్యాంకు గండిపడినప్పుడు స్థానికులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి, అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి ఈ సపోర్ట్ డ్యాంను కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు అందుకు భిన్నంగా నదిలోనే దొరికే రాళ్లను పేర్చి నిర్మించారని, ఇందులో భాగంగా సున్నపురాళ్లను కూడా పెట్టి నిర్మాణం చేపట్టారని విచారణలో తేలింది. దీని కారణంగానే 40 వేల క్యూసెక్కుల వరదకే డ్యాంకు గండిపడింది. కాగా డ్యాంను పునరుద్ధరించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఎస్సెల్బీసీ సొరంగం కుప్పకూలిన సమయంలో అక్కడికి వచ్చిన ఐఐటీ బృందంతో కలిసి ఈ డ్యాంను కూడా పరిశీలించారు. నాసిరకంగా నిర్మించిన ఈ సపోర్ట్ డ్యాంను పునరుద్ధరించినా ఫలితం ఉండదని, కొత్తగా నిర్మించాల్సిందేనని సదరు బృందం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో నిర్మాణానికి వెచ్చించిన రూ.వంద కోట్లు కృష్ణార్పణమేనని స్పష్టమవుతున్నది. అయితే ఒక చిన్న చెక్‌డ్యాం లాంటి నిర్మాణాన్ని పటిష్టంగా కట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక రంధ్రాన్వేషణ చేస్తున్నదన్న చర్చ నడుస్తున్నది.