కరీంనగర్: విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravi Shankar) డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారని విజయోత్సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు భరోసా ఎగ్గొట్టినందుకు విజయోత్సవామా అని నిలదీశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. లగచర్లలో రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు విజయోత్సవ సభలా అని విమర్శించారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఉచిత బస్సు పథకం తుస్సుమన్నదని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాపాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని దుయ్యబట్టారు. ఉద్యమాల గడ్డ వరంగల్ నుంచి ముఖ్యమంత్రి పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చుకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇండ్లు కూలగొట్టినందుకు సంబురాలా అని నిలదీశారు. హామీలు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.