కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 6 : మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిని వారం రోజులు గడిచినా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో పం టల పరిశీలన జరగలేదని, రైతులకు భరోసా ఇచ్చే దిక్కులేదని మండిపడ్డారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా సమీక్ష జరపలేదని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతూ గురువారం కరీంనగర్ కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఇంకెప్పుడు ఆదుకుంటుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వరి దెబ్బ తిన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని కోత లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.