వెల్దుర్తి, మే 28 : ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం తడిసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. చివరి గింజ వరకూ కొనాలని, లేకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.
ధాన్యం కేంద్రానికి తెచ్చి 45 రోజులు దాటుతున్నా ఒక్క గింజ కూడా తూకం వేయలేదని ఈ సందర్భంగా పలువురు రైతులు మండిపడ్డారు. తాము తిండి తిప్పలు మాని, అన్ని పనులు వదులుకొని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటేసి మోసం పోయామని, మార్పు ఇంతలా ఉంటుందని అనుకోలేదని రైతులు వాపోయారు.