హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ‘సింగూరు ప్రాజెక్ట్ నీటి విడుదల్లో సర్కార్ అనిశ్చితస్థితి, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయి. వెంటనే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి మిగిలిన పంటలను కాపాడాలి’ అని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆదివారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. పంటలు ఎండిపోతున్న తీరు, అన్నదాతల పరిస్థితిని ఏకరువుపెట్టారు. నీటి విడుదలపై సర్కార్‌కు స్పష్టతలేకపోవడంతో నర్సాపూర్, మెదక్ నియోజవర్గాల్లోని రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సింగూర్ నుంచి నీరు విడుదల చేసినట్టు సమాచారం ఉన్నప్పటికీ మంజీరా డ్యామ్ అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు లేఖపోవడంతో క్షేత్రస్థాయిలో పంటలకు నీరందలేదని ప్రస్తావించారు. ఈ సమస్యను గత నెలలో నీటిపారుదలశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశానని గుర్తుచేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలోనూ లేవనెత్తానని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఈఎన్సీ, ఎస్ఈ ద్వారా సింగూర్ ప్రాజెక్ట్ డీఈకి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయంలోపం రైతులకు శాపంగా మారిందని వివరించారు.
ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఘన్పూర్ ఆనకట్టకు అవసరం మేరకు నీరు విడుదల చేయకుంటే దాని పరిధిలోని 10 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఏడు చెక్‌డ్యామ్‌లకు నీరు రాదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అధికారుల లెక్కల ప్రకారం 21,600 ఎకరాలు, వాస్తవంగా 60వేల ఎకరాల్లోని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం వరి పంట చివరిదశలో ఉన్నదని, నీటి కొరతతో దిగుబడిపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, నీటి లభ్యత లేకుంటే పంటలు ఎండిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉన్నదని వివరించారు. తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీచేయాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు.