హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. 30 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతల నమోదుతో.. 27జిల్లాలకు ఆరెంజ్, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని తెలిపింది.
దీని ప్రభావంతో రాబోయే నాలుగురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్ రూరల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది.