Hyderabad | సుల్తాన్‌బజార్, అక్టోబర్ 1: హైదరాబాద్‌లో హవాలా డబ్బును తరలిస్తున్న ఓ ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.కోటికిపైగా నగదును స్వాధీ నం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సిరోహికి చెందిన లక్ష్మణ్(27), వసంత్(24) బైక్‌పై హనుమాన్ టేక్డీ నుంచి బొగ్గులకుంట వైపు హవాలా సొమ్మును రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు.
అనంతరం వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా హనుమాన్ వ్యాయామశాల ఎదుట శివ టవర్స్‌లోని రెండవ అంతస్తులో తరుణ్(26)ను అరెస్టు చేశారని ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.21 కోట్ల నగదుతోపాటు ఓ స్కూటర్, 2 కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎంతో చాకచక్యంగా ఈ నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుళ్లను అభినందించారు. ముంబైకి చెందిన బబ్లూ (35) అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ముఠా పనిచేస్తున్నట్టు చెప్పారు. విలేకర్ల సమావేశంలో అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శంకర్ కూడా పాల్గొన్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్‌ను పొడిగించండి
నాంపల్లి కోర్టులు/హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని కోరుతూ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య కారణాల రీత్యా ఇప్పటికే ఆయనకు రెండు విడతల్లో మొత్తం 35 రోజులు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ గడువు మంగళవారంతో ముగియడంతో తాజాగా ఆయన నాంపల్లిలోని 1వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.