నిజాంపేట/కేతేపల్లి, మే 31 : ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామానికి చెందిన స్వామి (33)కి ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నది. గ్రామస్థుల వద్ద రూ.2 లక్షలు అప్పుతెచ్చి వ్యవసాయం చేశాడు. రెండేండ్లుగా ఆశించిన దిగుబడి రాక అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం మేక గుడిసె వద్దకు వెళ్తున్నానని చెప్పి పాత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. కాగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన అవిరెండ్ల ఉపేందర్ (30) తనకున్న అరెకరంతోపాటు గ్రామంలో మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో ఉపేందర్ అప్పటికే పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనస్తాపం చెందిన ఉపేందర్ గురువారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఉపేందర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.