మిరుదొడ్డి/రామాయంపేట, జూన్ 11 : ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన నీరటి పరశురాములు (42) కూలి పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైందని కొందరు నాయకులు చెప్పడంతో ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయన్న ఆశతో ఇంటి నిర్మాణం కోసం వద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేసి బెస్మెంట్ వరకు ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఇండ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందని బాధితుడికి కొందరు నాయకులు తెలుపడంతో తీవ్ర మనస్తానికి గురైన పరశురాములు మంగళవారం తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరును తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురైన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన ఎరుకలి అశోక్ మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. అశోక్‌కు మొదటి విడతలోనే ఇల్లు మంజూరైందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దీంతో పూరిగుడిసెను తొలిగించి అదే స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఇల్లు పని లెంటల్ లెవల్ వరకు వచ్చింది. ఇంటికి ద్వారం కూడా ఎక్కించాడు. చివరకు ఇల్లు మంజూరు కాలేదని, జాబితాలో పేరు తొలిగించడంతో తీవ్రంగా కలత చెందాడు. ఉన్న పూరిగుడిసె తొలగించి అదే స్థలంలో అప్పుచేసి ఇంటి నిర్మాణం చేపడితే అధికారులు, నాయకులు తనకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో పేరు లేదనడంతో కలత చెంది ఇంట్లోనే ఓ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి 108 వాహనంలో మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.