Congress | ఇంత అహంకార ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాక్టో మాజీ చైర్మన్ భుజంగరావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు అవార్డులిచ్చే తీరిక రేవంత్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. మార్పు మార్పు అని మేము కాంగ్రెస్ వెంట పరిగెడితే ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఐదు శాతం ఐఆర్, ఐదు డీఏలు అడ్రస్ లేకుండా పోయినయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ మాటకామాట చెప్పుకోవాలి.. రాజకీయాలు కాదు కానీ కేసీఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి అని భుజంగరావు కొనియాడారు. అడగకుండానే కేసీఆర్ 73% ఫిట్మెంట్ ఇచ్చారన్నారు. ఎన్నికల ముందు 5 శాతం ఐఆర్ ప్రకటించి, మళ్లీ అధికారంలోకి వస్తే పీఆర్సీ ఇస్తానన్నారని.. కానీ మార్పు అని కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేధావులమని గొప్పలు చెప్పుకునే కోదండరాంరెడ్డి, ఆకునూరి మురళి ఎక్కడికి పోయారని భుజంగరావు ప్రశ్నించారు. ప్రజలు, విద్యార్థుల కష్టాలు కనపడటం లేవా? అని నిలదీశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నరని ఆర్జీయూకేటీ, పాలమాకుల గురుకులాల పిల్లలు రోడ్డెక్కారని గుర్తుచేశారు. దీనిపై మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేధావులు మీ గొంతులను అమ్మేసుకున్నరా? మీ వ్యక్తిత్వాన్ని కుదువ పెట్టుకున్నారా? అని నిలదీశారు.