హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభు త్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసని వెంకటేశ్వర రావును నియమించగా, కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి సైదులు వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ను ఏర్పాటు చేశామని, నెల రోజుల్లోగా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొన్నారు.
2021లో అప్పటి ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ సేకరించిన ఆధారాలు, సమాచారాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వ విభాగాల వద్ద సమాచారం సేకరించవచ్చని పేర్కొన్నారు. మేధావులు, సంఘా లు, ఇతర వర్గాలతో సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. కాగా, బీసీ సంఘా ల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో కలిశారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుపై కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే దా నం నాగేందర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వీ కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు.