హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై అధ్యయానికి సామాజికవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో భాగంగా పలు అంశాల సమాచారం (ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) కూడా ప్రభుత్వం వద్దకు వచ్చిందని, కాబట్టి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ చైర్మన్‌గా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కన్వీనర్‌గా ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులుగా డాక్టర్ సుఖ్దేవు, రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, శాంతాసిన్హా, ప్రొఫెసర్లు హిమా న్షు, భూక్యా భంగ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా జీన్ డ్రీజ్ ఉంటారని చెప్పారు. కమిటీకి స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు భట్టి పేర్కొన్నారు. సర్వేపై సమగ్రంగా అధ్యయనం చేసి నెలరోజుల్లోగా ప్రణాళికా సంఘానికి నివేదిక అందజేయాలని నిర్దేశించినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిషృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు శనివారం ప్రజాభవన్‌లో అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు అన్ని పార్టీల ఎంపీలకు ఫోన్ చేశారు. పెండింగ్ సమస్యలపై పార్లమెంటులో, కేంద్ర వద్ద మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్టు తెలిపారు .