IIT | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్నాయి. ఒకే ఒక్క చదువుల భారం.. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నది. అత్యున్నత విద్యాసంస్థలు మొదలుకొని చిన్నాచితక కాలేజీల వరకు విద్యార్థుల ఆత్మహత్యలతో దద్దరిల్లిపోతున్నాయి. ఫలితంగా చదువుల కేంద్రంగా విలసిల్లాల్సిన క్యాంపస్‌లు చావులకు కేరాఫ్‌గా మారుతున్నాయి.
అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు సూసైడ్ క్యాంపస్‌లను తలపిస్తున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయి కొందరు.. ఒత్తిడిని తట్టుకోలేక మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. మనోవేదనతో చావును కొనితెచ్చుకొంటున్నారు. ఇది ఐఐటీల వరకే పరిమితం కాకుండా కాలేజీలు, కోచింగ్ సెంటర్ల వరకూ పాకడం గమనార్హం. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న వారు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ, నీట్ కోచింగ్‌కు కేరాఫ్ అయిన కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. మెరిట్ విద్యార్థులు, ప్రతిభావంతులను దేశం, సమాజం కోల్పోతున్నది.
ఐఐటీల్లో హాహాకారాలు..
దేశంలోని ఐఐటీల్లో విద్యార్థుల బలవన్మరణాలు ఏటా పెరుగుతున్నాయి. ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐటీలు అన్న తేడాల్లేకుండా ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఐదేండ్ల కాలంలో 61 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నట్టు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023 మొదటి మూడు నెలల్లోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ ఇటీవలే రాజ్యసభలో వెల్లడించింది. గత ఐదేండ్లల్లో తీసుకొంటే 2019, 2022 సంవత్సరాల్లో అత్యధికంగా 16 మంది చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు కేంద్రం తెలిపింది.
కరోనాతో 2020, 2021 రెండు సంవత్సరాల్లో విద్యార్థులంతా ఇండ్లకే పరిమితం కాగా, విద్యార్థుల ఆత్మహత్యలు తక్కువగానే చోటుచేసుకొన్నాయి. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన తర్వాత 2022లో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2018 -23 మధ్యకాలంలో ఐఐటీల్లో 33 మంది, ఎన్టీల్లో 24 మంది ఐఐఎంలలో నలుగురు చొప్పున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2023 మార్చిలో ఐఐటీ మద్రాస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది కాలంలో ఇద్దరు.. రెండేండ్ల వ్యవధిలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ గణాంకాలే దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి అద్దంపడుతున్నాయి.
మరికొన్ని గణాంకాలు..
జీవన నైపుణ్యాలు నేర్పించాలి
చదువు, కెరీర్ ఒక్కటే జీవితమన్న తీరుగా విద్యార్థులు తయారువుతున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలు ఇదే విధంగా ఉంటున్నాయి. బాగా చదవగానే పాజిటివ్‌గా తీసుకొనే తల్లిదండ్రులు.. చదవడం లేదంటే నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. మీకు కావాల్సివన్నీ తెచ్చిపెడతాం బాగా చదివితే సరిపోతుందన్న భావనతో పిల్లల్ని పెంచుతున్నారు. వారి భావోద్వేగాలు, మానసికంగా ఎలా ఎదుగుతున్నారన్న ఆలోచన చేయడం లేదు. దీంతో విద్యార్థులు తమకు నచ్చినట్లు జరగకపోతే తట్టుకోలేకపోతున్నారు. ప్రాణాలు తీసుకొనేందుకు సిద్ధపడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్లకు వాళ్లుగా తట్టుకొనేలా.. ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి. జీవన నైపుణ్యాలు నేర్పించాలి. ఫ్రెండ్స్‌తో తిరగనివ్వాలి. బయట ఆడుకోనివ్వాలి. ఒక సమస్య వస్తే ఎలా తట్టుకోవాలో నేర్చుకొనే వాతావరణం కల్పించాలి.
– రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్
పోటీ పెరగడమే కారణమా?
జాతీయంగా నిర్వహించే పరీక్షలకు పోటీ పెరగడమే ఆత్మహత్యలకు కారణమనే చర్చ నడుస్తున్నది. 2023లో దరఖాస్తు చేసుకున్న 1.95 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో గట్టెక్కినా అడ్వాన్స్‌డ్‌లో అత్యధికులు గట్టెక్కలేకపోయారు. అడ్వాన్స్‌డ్‌కు మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సి ఉండటం, లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు తీసుకోవాల్సి ఉండటం విద్యార్థులను కలవరపెడుతున్నది.
చదివితే ఐఐటీల్లోనే చదవాలన్న బలమైన ఆకాంక్షలు సైతం ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కాలేజీ దశలో 10శాతం విద్యార్థుల్లో, పాఠశాల దశలోని 15 శాతం విద్యార్థుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. అయితే, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనను విరమించుకునే వారు కొందరైతే పరిస్థితులతో మిలితంకాలేక ఒంటరితనంతో తనువు చాలించే వారు మరికొందరు. ఈ పరిస్థితులను గమనించి తల్లిదండ్రులు నడుచుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.