Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచిం ది. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలు అందిస్తున్నది. ఈ వర్సిటీ భూములను తెగనమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్త కోర్సులు, పరిశోధనల విస్తరణ, ఇతరత్రా అవసరాల కోసం వర్సిటీని విస్తరించాల్సిన ప్రభుత్వం భూములను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఈ మేరకు గురువారం విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం విక్రయించేందుకు గుర్తించిన భూముల వద్దకు వెళ్లి ‘భూదోపిడీని అరికట్టండి… యూనివర్సిటీ భూములను తిరిగిచ్చేయండి’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబు సర్కారు హయాంలో 400 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఐఎంజీ భారత్‌కు కేటాయించారు. నామమాత్రపు రేటుకు ఆ భూములను కట్టబెట్టారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేసింది. దీంతో ఐఎంజీ భారత్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొన్ని నెలల కిందట ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ భూములను అమ్మేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
యూనివర్సిటీకి భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్మితే సహించేదిలేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఈ భూముల్లో గ్రానైట్ గుట్టలు, వృక్ష సంపద, వివిధ జాతుల జంతువులు, పక్షులు, నెమళ్ల పార్క్, చెరువులు ఉన్నాయని, వీటి వల్లనే యూనివర్సిటీ క్యాంపస్ ప్రత్యేక పర్యావరణాన్ని కలిగి ఉందని విద్యార్థులు తెలిపారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వమే అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ క్యాంపస్‌గా ఎదగనుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో యూనివర్సిటీ భూములను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతూ వచ్చిందని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విలువైన భూములపై కన్నేసి అమ్మడానికి సిద్ధమవుతున్నదని నిప్పులుచెరిగారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ భూములను కార్పొరేట్లకు అమ్ముతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడుతాం.
-మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు,
-లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హెచ్‌సీయూ భూముల వేలం ఆపకుంటే నిరసనలు ఉధృతం చేస్తాం. వర్సిటీలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా రీసెర్చ్ సెంటర్లు, హాస్టల్ భవనాలను నిర్మించేందుకు మరింత భూమి అవసరమవుతుంది. ఈ సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వమే భూములను అమ్ముకోవడం సిగ్గుచేటు. పాలన చేతగాకనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వర్సిటీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని నిర్ణయించింది. ఇలాంటి చర్యలను ఆపకుంటే ఆందోళనలు కొనసాగిస్తాం. సీఎం స్పందించకుంటే త్వరలో చలో సెక్రటేరియట్ చేపడతాం.
-అతీఖ్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్, హెచ్‌సీయూ
సీఎం రేవంత్ పర్యావరణాన్ని ధ్వంసం చేసి, హైదరాబాద్‌ను కాంక్రీట్ సిటీగా మార్చేందుకు కుట్రకు పాల్పడుతున్నారు. హెచ్‌సీయూ దక్షణాదిలోనే అత్యంత పెద్ద వర్సిటీగా మారబోతున్నది. ఇప్పటికే వర్సిటీకి చెందిన కొంత భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా అమ్మకానికే పెట్టడం దుర్మార్గమైన చర్య. హెచ్‌సీయూ భూముల అమ్మకం ఆపకుంటే ఆందోళనలు తీవ్రతరం చేసి, ప్రభుత్వానికి బుద్ధిచెప్తాం. పర్యావరణవేత్తలతో కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడున్న బయోడైవర్సిటీపై స్టడీ చేయాలి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల భూములకు చట్టబద్ధత కల్పించాలి.
– రమేశ్, డీఎస్‌యూ ప్రెసిడెంట్, హెచ్‌సీయూ