తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ నెల 25 దాకా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద శనివారం ఆవిష్కరించారు. దీనిపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పడాల సతీశ్, కడారి స్వామియాదవ్, తుంగ బాలును అరెస్ట్ చేయించింది.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటి హకుల కోసం బీఆర్ఎస్వీ చైతన్య ఉద్యమం చేపట్టింది. ‘జంగ్ సైరన్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి ఈ నెల 25 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఏపీ జలదోపిడీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నది.
గోదావరి నది జలాల్లో తెలంగాణ వాటాను కాపాడుకోవడం, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకోవడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కార్యక్రమ బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద శనివారం బీఆర్ఎస్వీ నేతలు పడాల సతీశ్, కడారి స్వామియాదవ్, తుంగ బాలు తదితరులు ఆవిష్కరించారు. పోలీసులు వారితోపాటు బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేశారు.
తెలంగాణకు గోదావరిలో సరైన వాటా రావాలని, వచ్చే తరాల భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగాలని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల వద్ద సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కళాశాలల విద్యార్థులకు ఏపీ జలదోపిడీపై బీఆర్ఎస్వీ నేతలు అవగాహన కల్పించారు.
పాలమూరు వర్సిటీలో బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ గడ్డం భరత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్టు, ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి దోపిడీపై విద్యార్థులకు సమావేశం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్‌లో, కూకట్పల్లి ప్రభుత్వ కళాశాలలో, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.