మోత్కూరు, నవంబర్ 28 : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది. పాఠశాలలో 429 మంది చదువుతుండగా.. గురువారం 363 మంది హాజరయ్యారు. వారికి మ ధ్యాహ్నం వడ్డించిన అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై గడ్డలు కట్టి పలుకైంది.
ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు. ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లారు. ఆకలిని తట్టుకోలేని కొందరు విద్యార్థులు హోటళ్లలో టిఫిన్ చేశారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన బియ్యం నాణ్యత లేకుండా పురుగులు పట్టి ఉన్నట్టు గుర్తించిన ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 27న మండల ప్రత్యేకాధికారి యాదయ్య ఆరు క్వింటాళ్ల బియ్యం కొత్తవి తెప్పించారు. అవి కొత్తవి కావడం, నాణ్యత లేకపోవడంతో అన్నం ముద్దగా, గడ్డలు కట్టడంతో విద్యార్థులు తినలేక ఇబ్బందులు పడ్డారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.