చిక్కడపల్లి, జూలై 17: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్ని కలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగుల ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల ఉద్యోగ సాధన కోసం గురువారం హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు ర్యాలీ చేపట్టారు.
పోలీసులు అడ్డుకోవడంతో గ్రంథాలయంలోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో జేఏసీ నాయకులు నరేశ్, మహేశ్, సతీశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.