హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లోని పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ‘స్పెషల్’ క్లాసులకు హాజరవుతున్న వీరు స్నాక్స్‌కు నోచుకోలేకపోతున్నారు. పది పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సర్కార్ బడుల్లో స్పెషల్‌క్లాసులు ప్రారంభించింది. కొన్ని జిలాల్లో అక్టోబర్ నుంచి, మరికొన్ని జిల్లాల్లో అక్టోబర్ నుంచే షురూ చేశారు. అయితే మధ్యాహ్నం వేళల్లో తిన్న భోజనం విద్యార్థులకు సరిపోవడంలేదు. స్పెషల్‌క్లాసులు పూర్తయ్యి ఇండ్లకు వెళ్లేసరికి రాత్రి అవుతున్నది. అప్పటిదాకా ఏం తినకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో టీచర్లు స్నాక్స్, అరటిపండ్లు సమకూరుస్తున్నారు.
రాష్ట్రంలో 4,500 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మరో 194 మాడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1.9లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పది స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చడం కేసీఆర్ సర్కారు హయాంలోనే ప్రారంభమైంది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 వెచ్చించి బలవర్ధకమైన, శక్తినిచ్చే మెనూ ఖరారుచేశారు. మిల్లెట్ బిస్కట్లు, పల్లిపట్టి, బొబ్బర్లు/ఉడకబెట్టిన శనగలు, ఉల్లిపకోడి, మొలకలు మెనూలో చేర్చారు.