హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని, నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని సిబ్బందికి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురువారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బీసీ సంక్షేమశాఖ, గురుకుల సొసైటీ అధికారులు, సంక్షేమహాస్టళ్ల వార్డెన్లతో సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. సమస్యలు క్షేత్రస్థాయిలో పరిషారం కాకపోతే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో అధికారుల దృష్టికి తేవాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఎంజేపీ సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీలు తిరుపతి, మద్దిలేటి పాల్గొన్నారు.