భైంసా టౌన్, జూలై 8: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం జిల్లా పరిషత్, ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు ఈ నెల 4న మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం ఇంటికెళ్లిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వెంటనే స్థానిక ఆర్ఎంపీకి చూపించి చికిత్స అందించారు.
శనివారం రాత్రి జ్వరం తీవ్రం కావడంతో భైంసా ఏరియా దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, ఫుడ్ పాయిజన్ వల్లనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఈ విషయమై మండల విద్యాధికారి సుభాష్ను వివరణ కోరగా.. సోమవారం దవాఖానకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని, విద్యార్థులు కోలుకుంటున్నారని తెలిపారు.
పాఠశాలా.. చెరువు కుంటా?
ఐనవోలు : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలోని సర్కారు పాఠశాల ఆవరణ.. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి జలమయమైంది.సోమవారం విద్యార్థులు పాఠశాలకు వచ్చి చూడగా.. స్కూల్ ఆవరణ మొత్తం వర్షపునీటితో చెరువును తలపించింది. స్కూల్ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండటంతో తిరిగి ఇండ్లకు వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సైడ్, అండర్ డ్రైనేజీలకు మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.