పెనుబల్లి (కల్లూరు) : ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్ తిని, రాత్రి భోజనం చేసిన పదిమంది కడుపునొప్పితో దవాఖాన పాలయ్యారు. పదిమంది విద్యార్థినులను వసతిగృహ సిబ్బందే కల్లూరు వైద్యశాలకు తరలించారు.
13 రోజుల వ్యవధిలో ఇదే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఇది మూడోసారి! ఈ నెల 4న కిచిడీ తిన్న పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా ఇడ్లీ తిన్న విద్యార్థినుల్లోనూ నలుగురు అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ విజయనిర్మలను గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి అదే రోజు సస్పెండ్ చేశారు.
తాజాగా మరోసారి విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 13 రోజుల వ్యవధిలో మూడోసారి ఫుడ్పాయిజన్ జరిగిందంటే.. గురుకులాలను ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్వహిస్తున్నదో అర్థమవుతున్నదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.