Congress Govt | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ సమాజంలో ఉద్యమాలకు పురిటిగడ్డ. ప్రజాగొంతుకగా నిలిచిన వేదిక. కానీ కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల గొంతులను అణచివేస్తున్నదని విద్యార్థి సంఘాలు తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. హక్కుల గోసం గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. సర్క్యులర్లతో హక్కులను కాలరాయడం కరెక్ట్ కాదని మాజీ వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు మండిపడుతున్నారు.
యూనివర్సిటీలో తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు నిరసనలు తెలుపుతారు. ఉన్నత విద్యా సంస్థలలో ఇలాంటివి అవసరమే. వాటిని నియంత్రించాలనుకోవడం సమంజసం కాదు. రాజ్యాంగపరంగా విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుకోవచ్చు. వాటికి నిషేదాజ్ఞలు ఎక్కడా లేవు.
– ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో విద్యార్థులు, అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా చాలా సభలు జరిగాయి. ఇలాంటి సర్క్యులర్లు తీసుకురావడం వల్ల విద్యార్థులను మరింతగా రెచ్చగొట్టినట్టే అవుతుంది. ఇలాంటి సర్క్యులర్ల వల్ల అనర్థాలే తప్ప, మంచి జరుగదు. ఈ విషయాన్ని బాధ్యులు ఎవరైనా గ్రహించాల్సిన అవసరం ఉంది.
-ప్రొ. సత్యనారాయణ, ఓయూ మాజీ వీసీ
సమస్యలు పరిష్కారం కోసం ఆందోళనలు చేసే హక్కులు విద్యార్థులకు ఉంటాయి. విద్యార్థులు తమ భావాలను వ్యక్తపరుచుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలుపుకోవచ్చు. ఇలాంటి సర్క్యులర్లు జారీ చేయడం సమంజసం కాదు. విద్యార్థులు యూనివర్సిటీ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ఉన్నంతవరకు నిరసనలు తెలుపుకునే హక్కులు ఉంటాయి.
– రవీంద్రయాదవ్, ప్రొఫెసర్
యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు తెలపకూడదని చెప్పలేదు. వీసీ చాంబర్లు, రిజిస్ట్రార్ కార్యాలయాలు, డీన్లు, ప్రిన్సిపాళ్ల రూమ్లలో నిరసనలు చేయవద్దు అని మాత్రమే చెప్పాం. సర్క్యులర్లో కూడా అదే ఉంది. కానీ దానిని కొంతమంది విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది. కోర్టు నిర్ణయం తర్వాత మా నిర్ణయం ఉంటుంది.
– ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఓయూ వీసీ