నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 6: స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేపర్ లీకేజీకి పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమంటున్నారు. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. బండిని ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో టెన్త్ పరీక్షా కేంద్రం ఎదుట, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, మునగాల, నకిరేకల్, నల్లగొండ, కేతేపల్లిలో బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. లీకేజీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.