శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:22:07

గంటకో విద్యార్థి ఆత్మహత్య

గంటకో విద్యార్థి ఆత్మహత్య

  • గతేడాది 10,335 మంది విద్యార్థులు సూసైడ్‌
  • గత పాతికేండ్లలో ఇదే గరిష్ఠం 
  • 1995-2019 మధ్య 1.7 లక్షల మంది..విద్యార్థుల బలవన్మరణం
  • ఎన్‌సీఆర్‌బీ 2019 నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామన్న భయం ఒకరిది.. తల్లిదండ్రులు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామన్న ఒత్తిడి ఇంకొకరిది.. కారణం ఏదైతేనేం బంగారు భవిష్యత్తును విద్యార్థులు బలి చేసుకుంటున్నారు. దేశంలో గంటకో విద్యార్థి బలవన్మరణం పాలవుతున్నాడన్న ఆందోళనకరమైన విషయాన్ని ఎన్‌సీఆర్‌బీ 2019 నివేదిక వెల్లడించింది. గత 25 ఏండ్ల గణాంకాలు విశ్లేషిస్తే ఎన్నడూ లేనంతగా 2019లో 10,335 మంది విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినట్టు నివేదిక తెలిపింది. 

25 ఏండ్లలో 1.7 లక్షల మంది

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 1995 నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకు దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో గత పదేండ్లలోనే 52 శాతం(85,824 మంది) విద్యార్థులు అసువులబాసారు. 2019లో మొత్తం 10,355 ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (1,487), మధ్యప్రదేశ్‌ (927), తమిళనాడు (914), కర్నాటక (673), ఉత్తరప్రదేశ్‌ (603)ల్లో కలిపి 44% మరణాలు నమోదయ్యాయి. గతేడాదిలో తెలంగాణలో 426 మంది, ఏపీలో 383 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

పది నుంచి పన్నెండేండ్ల వారే ఎక్కువ

విద్యార్థుల ఆత్మహత్యల్లో ప్రధానంగా 10 నుంచి 12 ఏండ్ల వారే ఎక్కువగా ఉంటున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. ఈ వయస్సుల పిల్లల్లో యాైంగ్జెటీ, ఆత్రుత ఎక్కువగా ఉండి.. ఒత్తిడిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో వారికి పాలుపోవడం లేదు.  తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలను ప్రశాంతంగా వివరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 



logo