ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 12: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముట్టడి సరికాదని, ఆయన ఇంటి ముందు చావు డప్పులు కొట్టడం దుర్మార్గమని పలువురు విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముందు లక్ష డప్పులతో వీరవిహారం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతల వైఖరికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపెల్లి నరేశ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి, తొలి సీఎం ఇంటి ముందు బతికున్న వ్యక్తికి చావుడప్పు కొట్టించి, పైశాచిక ఆనందం పొందారని ధ్వజమెత్తారు. దళిత ముసుగులో ఉన్న కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పుతున్నవారిని, ఉపేక్షించబోమని హెచ్చరించారు.