Coalcity | కోల్ సిటీ: చేయూత పెన్షన్ పథకం (Cheyutha Pension Scheme) దరఖాస్తుల పరిశీలనలో పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం సవరణ చేసింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చేయూత అందేనా..? సదరమ్ రాక లబ్ధిదారుల ఆందోళన’ శీర్షికతో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనాని స్పందించిన పెద్దపల్లి డీఆర్డీవో కాళిందిని సవరణ చేశారు. నగర పాలక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేయూత పెన్షన్ పథకం అమలు కోసం దరఖాస్తుల క్షేత్ర పరిశీలన బుధవారంతో ముగియనుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 3561 దరఖాస్తులు రాగా, వీటిలో సగం వరకు దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఉన్నారు.
వారం క్రితం గోదావరిఖనిలో జరిగిన సదరమ్ క్యాంపులో వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తి కాగా, ధ్రువీకరణ పత్రం జారీకి సమయం పడుతుంది. కానీ కార్పొరేషన్లో క్షేత్ర పరిశీలనకు వెళ్లిన వార్డు అధికారులు సదరమ్ సర్టిఫికెట్ ఉంటేనే ఆన్లైన్లో అర్హులుగా నమోదు చేస్తామని లేదంటే తిరస్కరిస్తామని హెచ్చరించారు. దీంతో దరఖాస్తుదారుల్లో మొదలైన ఆందోళన నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురించిన కథనానికి డీఆర్డీవో కాళిందిని స్పందించారు.
ప్రస్తుతం సదరమ్ (Sadarem) సర్టిఫికెట్ లేకపోయినా, నిర్దేశిత అనారోగ్య శాతం ఉంటే తిరస్కరించకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని, పక్షం రోజుల గడువులోగా సదరమ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. దీంతో దరఖాస్తుదారులకు కొంత ఊరట కలిగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే క్షేత్ర పరిశీలనలో సదరమ్ సర్టిఫికెట్ లేక తిరస్కరణకు గురైన బాధితుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.