హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13: విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్య ఆరోపణలు ఖండిస్తూ విద్యార్థి సంఘాలు, సాలర్స్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జాతీయ నాయకులు మహే శ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కేయూ సాలర్స్, బీసీ విద్యార్థి సంఘం, స్వేరోస్ నేతలు మాట్లాడారు.
బుధవారం మహాసభల ప్రచారం కోసం స్మైలీ డిజీ సూల్కు వెళ్లిన పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మ ర్రి మహేశ్‌పై పాఠశాల చైర్మన్ శ్రీనివాస్‌వర్మ అసభ్యకర పదజాలం, కులం పేరుతో దూషించి భౌతిక దాడిచేశారని ఆరోపించారు. మర్రి మహేశ్‌ని ఇనుపరాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. కులంపేరుతో దూషించి, దాడి చేసిన స్మైలీ డీజీ సూల్ చైర్మన్ శ్రీనివాస్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్మైలీ పాఠశాలకు ఒక బ్రాంచ్‌కి మాత్రమే పర్మిషన్ ఉంటే రెండు బ్రాంచులు ఓపెన్‌చేసి దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.