ఇంద్రవెల్లి, అక్టోబర్ 26: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడావి గంగోత్రి (14) వాంతులు, విరేచనాలు చేసుకుని శనివారం మృతి చెందింది. ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండకు చెందిన మడావి కృష్ణ-జంగుబాయి దంపతుల రెండో కూతురు గంగోత్రి తొమ్మిదో తరగతి చదువుతున్నది.
దసరా సెలవులకు ఇంటికెళ్లి ఈ నెల 21న పాఠశాలకు తిరిగి వచ్చింది. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న గంగోత్రి శనివారం తెల్లవారు జమున వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ కోల్పోయింది. పాఠశాల సిబ్బంది ఆటోలో మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని తెలుపడంతో రిమ్స్‌కు తరలించారు.
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న గంగోత్రిని బాత్ రూమ్‌కి వెళ్లిన పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదని, దీంతో బాత్ రూమ్‌లోనే స్పృహ కోల్పోయి మృతి చెందిందని, చనిపోయిన తరువాతనే దవాఖానకు తరలించారని ఆదివాసీ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేసిన ఆదివాసీ సంఘాల నాయకులతోపాటు వాల్గొండ గ్రామ పెద్దలతో పోలీసులు, అధికారులు చర్చించారు. ఐటీడీఏ ఏటీడబ్ల్యూవో క్రాంతి, సీఐ మొగిలి ఆధ్వర్యంలో గంగోత్రి కుటుంబానికి ఐటీడీఏ ఈఎస్ఎస్ పథకం ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో అంత్యక్రియలు నిర్వహించారు.